: ఇకపై ఆన్‌లైన్‌లోనే జేఈఈ (అడ్వాన్స్ డ్) పరీక్షలు!
ఇకపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల ప్రవేశ పరీక్షలు పూర్తిగా ఆన్ లైన్ లోనే జరగనున్నాయి. వచ్చే ఏడాది, 2018 నుంచి ఈ విధానం అమలు కానుంది. ఈ మేరకు జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) ఓ నిర్ణయం తీసుకున్నట్టు జేఏబీ-2017 చైర్మన్, ఐఐటీ-మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ భాస్కర రామమూర్తి తెలిపారు. 2018 నుంచి జేఈఈ (అడ్వాన్స్ డ్) పరీక్షలు ఆన్ లైన్ లోనే నిర్వహించాలని నిర్ణయించామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని త్వరలో అందజేస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం సులువుగా ఉండాలన్న ఉద్దేశంతోనే జేఈఈ (అడ్వాన్స్ డ్)ని ఆన్ లైన్ లో నిర్వహించనున్నట్టు జేఏబీ సభ్యుల్లో ఒకరు చెప్పారు.
ఈ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించేందుకు తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉందని అన్నారు. ఇకపై పెన్ను-పేపర్ విధానానికి స్వస్తి చెప్పి, కంప్యూటర్ ద్వారానే ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ విధానాన్ని అవలంబించడం ద్వారా ఫలితాలు వేగంగా వెలువడటం, నిజాయతీగా మూల్యాంకనం చేయడం, ప్రశ్నాపత్రాల ముద్రణలో తప్పులు దొర్లకుండా చూడటం, ప్రశ్నాపత్రాల లీకేజ్ లేకుండా నిరోధించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.
కాగా, ప్రశ్నాపత్రాల్లో తప్పులు దొర్లడం కారణంగా ఈ ఏడాది మద్రాస్ ఐఐటీ 18 బోనస్ మార్కులను విద్యార్థులకు ఇవ్వాల్సి వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని సుప్రీంకోర్టుకు మద్రాస్ ఐఐటీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జేఏబీ తాజా నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, జేఈఈ -మెయిన్స్ పరీక్ష రాసేందుకు మాత్రం పాతపద్ధతి ( పెన్ను-పేపర్ లేదా కంప్యూటర్)లోనే జరగనుంది. అంటే, పెన్ను-పేపర్ లేదా కంప్యూటర్ లో ఏదో ఒక విధానాన్ని విద్యార్థులు ఎంచుకోవచ్చు.