: శ్రీలంక క్రికెటర్లు వెళ్తున్న బస్సును అడ్డుకున్న అభిమానులు
శ్రీలంక క్రికెట్ టీమ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. వరుస ఓటములతో ఆ టీమ్‌పై ఒత్తిడి పెరిగిపోతోంది. శ్రీలంక క్రికెట్ అభిమానులు తమ దేశ జట్టు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను ఓడిపోయిన శ్రీలంక వన్డేల్లోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో తమ క్రికెటర్ల ఆట తీరుకి నిరసనగా వారు ప్రయాణించే బస్సుని అడ్డుకున్నారు. దంబుల్లాలో నిన్న జరిగిన తొలి వన్డేలో పాల్గొని, అనంతరం హోటల్‌కు వెళ్లడానికి శ్రీలంక క్రికెటర్లు బస్ ఎక్కారు. అదే సమయంలో దాదాపు 50 మంది శ్రీలంక క్రికెట్ అభిమానులు దాన్ని అడ్డుకుని క్రికెటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ఆటతీరును హేళన చేశారు. దీంతో దాదాపు అరగంట పాటు బస్సు ముందుకు కదల్లేదు. చివరకు అభిమానులు ఆ బస్సు వెళ్లడానికి దారి ఇచ్చారు.
మరోవైపు తమ ఆటగాళ్ల పేలవ ప్రదర్శనపై శ్రీలంక టీమ్ కోచ్ నిక్ పోథాస్ స్పందిస్తూ.. టీమ్‌పై బయటి వ్యక్తుల పెత్తనం అధికమైపోతోందని అన్నారు. జట్టుపై ఆ దేశ ప్రభుత్వంతోపాటు సెలక్టర్లు కూడా తలదూర్చడం మంచిది కాదని పేర్కొన్నారు. తమకు పూర్తి స్వేచ్ఛ కావాలని అన్నారు.