: హెచ్-1బీకి దరఖాస్తు చేసుకున్న వారిలో 74 శాతం మనవారే!
అమెరికాలో ఉద్యోగాలను చేయాలని భావించే టెక్నాలజీ నిపుణులు, ఇతర ఉద్యోగులు దరఖాస్తు చేసుకునే హెచ్-1బీ వీసాల విషయంలో ఇండియా ముందు నిలిచింది. ఈ సంవత్సరం జూన్ వరకూ నమోదైన గణాంకాలను అమెరికా ప్రభుత్వం విడుదల చేయగా, మొత్తం 2.47 లక్షల దరఖాస్తులతో 74 శాతం ఇండియన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకుని తొలి స్థానంలో ఉన్నారు. అక్టోబర్ 1తో మొదలయ్యే అమెరికా ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగుస్తుందన్న సంగతి తెలిసిందే.
ఇక తొలి తొమ్మిది నెలల కాలంలో గతంతో పోలిస్తే వీసా దరఖాస్తుల సంఖ్య పెరిగింది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా చైనా నుంచి 35,720 దరఖాస్తులు రాగా, ఇండియా తరువాతి స్థానంలో చైనీయులు నిలిచారు. కెనడా మూడో స్థానంలో 3,551 దరఖాస్తులకు పరిమితమైంది. జూన్ వరకూ మొత్తం 3.36 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిల్లో 1.97 లక్షల దరఖాస్తులను ఆమోదించామని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం పేర్కొంది. చాలా దరఖాస్తులను ఇంకా పరిశీలించాల్సి వుందని వెల్లడించింది.
ఇదిలావుండగా, అక్టోబర్ 1, 2006 నుంచి జూన్ 30, 2017 వరకూ పరిశీలిస్తే, ఇండియా నుంచి 21.83 లక్షల దరఖాస్తులు రాగా, చైనా నుంచి 2.96 లక్షలు, ఫిలిప్పీన్స్ నుంచి 85,918 దరఖాస్తులు వచ్చాయి. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చే దరఖాస్తులు 2006తో పోలిస్తే 70 శాతం వరకూ తగ్గాయని యూఎస్ అధికారులు విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. భారత దరఖాస్తుదారుల సంఖ్య 80.6 శాతం పెరిగిందని తెలిపారు. ఇక వీసాలను కోరిన టాప్-5 కంపెనీలుగా కాగ్నిజెంట్ ముందు నిలువగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఆక్సెంచర్, విప్రోలు ఆపై స్థానాల్లో ఉన్నాయి. కాగా, ఈ వీసాపై అమెరికాకు వెళ్లే వారికి కనీసం 1.30 లక్షల డాలర్లను సంవత్సర వేతనంగా ఇవ్వాలన్న నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.