: కడపలో ఘోరం.. ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై హెచ్ఐవీ రక్తం చల్లిన వైద్యుడు!
ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై ఓ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. హెచ్‌వీఐ కలిగిన రక్తంతో అతనిపై దాడిచేశాడు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. డేవిడ్ రాజ్ 2014 నుంచి ఈ ఆసుపత్రిలో ఎముకల వైద్య నిపుణుడు (ఆర్థోపెడీషియన్)గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వార్డులో రౌండ్లు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ లక్ష్మీ ప్రసాద్‌పై డేవిడ్ రాజ్ హెచ్‌వీఐ కలిగిన రక్తాన్ని స్ప్రే చేశాడు. అయితే ఆ రక్తాన్ని ఇంజెక్ట్ చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సూపరింటెండెంట్‌పై రక్తాన్ని చిమ్మినట్టు డేవిడ్ రాజ్ అంగీకరించాడు. తనను లాంగ్‌లీవ్‌పై ఆసుపత్రి నుంచి వెళ్లమని చెప్పడంతో అతడిని భయపెట్టాలనే అలా చేసినట్టు వివరించాడు. ఈ ఘటనపై ఆసుపత్రి సేవల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జయరాజ్ విచారణకు ఆదేశించారు. పోలీసులు మాత్రం ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. కాగా, డేవిడ్ రాజ్ బైపాస్ సర్జరీ చేయించుకున్నాడని, తీవ్ర డిప్రెషన్‌లో ఉండడం వల్లే అలా ప్రవర్తించాడని ప్రొద్దుటూరు డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది.