: నిర్మాణం పూర్తయిన 29 ఏళ్లకు విడుదలవుతున్న బాలీవుడ్ చిత్రం
1988లో హిందీ గీతరచయిత, ఆస్కార్ గ్రహీత గుల్జార్ తీసిన `లిబాస్` సినిమా త్వరలో విడుదల కానుంది. గుల్జార్ 83వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా విడుదల విషయాన్ని జీ స్టూడియోస్ ప్రకటించింది. నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని, గుల్జార్ తాను రచించిన `సీమ` అనే కథానిక ఆధారంగా తెరకెక్కించారు.
ఇందులో అలనాటి నటులు రాజ్ బబ్బార్, సుష్మా సేత్, ఉత్పల్ దత్, అన్నూ కపూర్, సవితా బజాజ్‌లు కూడా నటించారు. ఈ చిత్రానికి ఆర్డీ బర్మన్ సంగీతం సమకూర్చారు. అప్పట్లో విడుదలకు నోచుకోని ఈ చిత్రాన్ని 22 ఏళ్ల తర్వాత మొదటి సారి 2014లో గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. అంతకుముందు 1992లో బెంగుళూరులో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కూడా ప్రదర్శించారు. 2017 చివర్లోగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు జీ స్టూడియోస్ తెలిపింది.