: నన్ను నడిరోడ్డులో కాల్చేస్తాడట.. ఈ భాష కరెక్టానా తమ్ముళ్లూ?: నంద్యాలలో చంద్రబాబు
‘నన్ను పట్టుకుని నడిరోడ్డులో కాల్చేయాలని, బట్టలు విప్పేయాలని జగన్ అంటున్నారు’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ రోజు ఆయన నంద్యాలలో ఉప ఎన్నిక ప్రచారంలో మాట్లాడుతూ... ‘ఈ భాష కరెక్టానా తమ్ముళ్లూ? మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు.. ఇదేనా మనం నేర్చుకోవాల్సిన భాష.. రాజకీయ నాయకులు ఆదర్శవంతంగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవద్దు.. నా కోసం ఆహారపదార్థాలు తెచ్చే వాహనంపై కూడా దాడి చేశారు. నాకు చేతికి ఉంగరం, గడియారం కూడా ఉండవు’ అని చంద్రబాబు అన్నారు.
‘ఆ వాహనంలో రాగులు, సజ్జలు ఉన్నాయి.. అదే వైసీపీ వాహనాల్లో సోదాలు చేస్తే బంగారు బిస్కెట్లు లాంటివి దొరుకుతాయి.. కానీ, తాను అటువంటి దాడులు జరిపించబోను’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీకే ఓటు వేసి, మంచిని గెలిపించాలని అన్నారు. మంచిని ప్రోత్సహించడానికి ప్రజలకు ఇది చక్కటి అవకాశమని అన్నారు. నంద్యాల సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత తనదేనని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం ప్రతిపక్ష నాయకుడు గడ్డం పట్టుకుంటున్నారని, బుగ్గలు గిల్లుతున్నారని ఎద్దేవా చేశారు.