: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మరోసారి అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ
ఈ రోజు ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ 873 పాయింట్లతో మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక రెండో స్థానంలో 861 పాయింట్లతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఇరువురి బ్యాట్స్‌మెన్ మధ్య పాయింట్ల తేడా 12గా ఉంది. టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ప్రారంభం కానున్న వన్డే మ్యాచుల్లో విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరిన్ని పాయింట్లు చేరుతాయని, దీంతో రెండో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ కన్నా కోహ్లీ అత్యధిక పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇక టీమిండియాలో కోహ్లీ మినహా ఏ బ్యాట్స్‌మెన్ టాప్‌టెన్‌లో చోటు సంపాదించలేదు. మహేంద్ర సింగ్ ధోనీ 12, శిఖర్ ధావన్ 13, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 14 వ స్థానాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియాలో ఒక్క బౌలర్‌కి కూడా చోటు దక్కలేదు. టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ 13వ స్థానంలో ఉన్నాడు. అలాగే వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా జట్టు ప్రస్తుతం మూడవ స్థానంలో ఉంది. ఈ ర్యాంక్‌ను ఇలాగే కొనసాగించాలంటే శ్రీలంకతో జరగనున్న వన్డేల్లో టీమిండియా 4-1 తేడాతో గెలవాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 114 పాయింట్లు ఉన్నాయి. ఒకవేళ శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో భారత్ 3-2 తేడాతో గెలిచినా భారత్ మూడో స్థానంలో నిలబడే అవకాశాలు ఉండబోవు. ఆ స్థానంలోకి ఇంగ్లండ్ ఎగబాకే అవకాశం ఉంటుంది.