: తన ప్రియుడు వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని.. నెయిల్ పాలిష్ రిమూవర్ తాగి ప్రియురాలి ఆత్మహత్యాయత్నం
తనను ప్రేమించిన యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడన్న మనస్తాపంతో ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్ తాగి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని మణికేశ్వరంలో నివసించే యువకుడు ఎస్‌కె కరిముల్లా తమ గ్రామానికే చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. అయితే, వీరి ప్రేమాయణానికి 2014లో బ్రేక్ పడింది. ఆ ఏడాది ఉద్యోగం కోసం చెన్నైకి వెళ్లిన తన ప్రియురాలు అక్కడ మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో కరిముల్లా ఆమెతో మాట్లాడడం లేదు.
కాగా, కొన్ని రోజుల క్రితం కరిముల్లాకు మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 17న (నిన్న) వారి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. అయితే, మొన్న కరిముల్లాపై ఆమె ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి మోసం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆమె పోలీసులకు చెప్పింది. అయితే, పోలీసులు మొన్న సాయంత్రం వరకు చర్యలు తీసుకోకపోవడంతో ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసింది. కాగా, ఆమె ప్రియుడు కరిముల్లా నిన్న తెల్లవారు జామున మసీదులో పెద్దలు నిశ్చయించిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో కరిముల్లా ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. మరోవైపు కరిముల్లా ఎక్కడికో పారిపోయాడు. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.