: తునిలో పెట్రోల్‌కు బదులు నీళ్లు పోసిన బంకు సిబ్బంది.. వాహనదారుల ఆందోళన!
వాహనంలో పెట్రోల్ పోయించుకుందామని బంకుకి వెళ్లిన వాహనదారులు కంగుతిన్నారు. తమ వాహనాల్లో పెట్రోల్ బంకు సిబ్బంది పోసింది నీళ్లని తెలుసుకొని ఆందోళనకు దిగారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటు చేసుకుంది. అక్కడి ఎర్రకోనేరు జాతీయ రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులో వాహనదారులు పెట్రోల్ కొట్టించుకుని వెళ్లారు. అయితే, కొద్ది సేపటికే వారి వాహనాలు ఆగిపోయాయి. దీంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడి, పెట్రోల్ బంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై బంకు నిర్వాహకులు మాట్లాడుతూ... పెట్రోల్ కు బదులు నీళ్లు రావడానికి కారణాలేమిటో తమకు తెలియదని అన్నారు. ఈ విషయంపై తాము కంపెనీ నిపుణులను అడుగుతామని అంటున్నారు.