: ఇన్ఫోసిస్ లో పెను సంక్షోభం... సీఈఓ విశాల్ సిక్కా రాజీనామా!
ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ లో సంక్షోభం మరింతగా ముదిరింది. సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా సేవలందిస్తున్న విశాల్ సిక్కా తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాజీమానాను తక్షణమే ఆమోదిస్తున్నట్టు బోర్డు డైరెక్టర్లు ప్రకటించారు. ఇంత అకస్మాత్ నిర్ణయానికి కారణాలను తన రాజీనామా లేఖలో వివరిస్తూ, తనపై జరుగుతున్న మాటల దాడితో బాధ పడ్డానని అన్నారు.
ఇన్ఫోసిస్ ఓ గొప్ప సంస్థని చెప్పడంలో సందేహం లేదని, అయితే, ఇటీవలి కాలంలో సంస్థలో వచ్చిన విభేదాలు, మేనేజ్ మెంట్ పై ఉద్యోగులు, కస్టమర్లలో పెరుగుతున్న వ్యతిరేకత సంస్థ వృద్ధికి అడ్డంకులుగా నిలిచాయని పేర్కొన్నారు. తదుపరి తరం ఐటీ కంపెనీగా ఇన్ఫీ ఎదిగే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయని అన్నారు.
ఇక రాజీనామాను ఆమోదించిన బోర్డు, "రాజీనామాకు సిక్కా చెప్పిన కారణాలను అర్థం చేసుకున్నాం. ఆయన నిర్ణయం బాధాకరమే అయినా, ఆమోదిస్తున్నాం. మేనేజ్ మెంట్ పై వచ్చిన విమర్శలన్నీ అవాస్తవాలు" అని పేర్కొంది. కాగా, ఎండీ, సీఈఓ పోస్టులకు రాజీనామా చేసినప్పటికీ, విశాల్ సిక్కా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ హోదాలో కొనసాగుతారని, ఆయన సేవలను మరింత కాలం పాటు వినియోగించుకుంటామని తెలిపింది. సంస్థకు తాత్కాలిక ఎండీ, సీఈఓగా యూబీ ప్రవీణ్ రావును నియమిస్తున్నామని వెల్లడించింది. ప్రవీణ్ రావు బాధ్యతలు స్వీకరించేంత వరకూ సిక్కా బాధ్యతల్లో కొనసాగుతారని తెలిపింది.