: వచ్చే ఏడాది టెలికాం రంగంలో కొత్తగా 30 లక్షల ఉద్యోగావకాశాలు
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యుగం నడుస్తోంది. సినిమా టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ఏవైనా వస్తువులు కొని డబ్బులు చెల్లించాలన్నా, డబ్బులు బదిలీ చేయాలన్నా అంతా స్మార్ట్‌ఫోన్‌ను విరివిగా వాడేస్తున్నారు. ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ లేని వారి సంఖ్య తక్కువగానే ఉంది. దీంతో టెలికాం రంగంలో వచ్చే ఏడాది కొత్త ఉద్యోగావకాశాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఓ సర్వే తెలిపింది. వచ్చే ఏడాది 30 లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగదారులు డేటాను అధికంగా వాడుతున్న విషయం తెలిసిందే. 4జీ టెక్నాలజీ ఆవిష్కరణ, కొత్త ఆపరేటర్లు మార్కెట్‌లోకి రావడం, డిజిటల్ వాలెట్ల ప్రవేశం, స్మార్ట్‌ఫోన్‌లు విరివిగా ఉపయోగిస్తుండడంతో టెక్నాలజీకి విపరీతమైన డిమాండ్ వచ్చింది.
దీంతో ఈ రంగంలో కొత్త ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయని అసోచామ్-కేపీఎంజీ సంయుక్త అధ్యయనం స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో 5జీ రావడం, ఎం2ఎం, ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ గురించి అందరికీ అవగాహన ఏర్పడుతుండడంతో 2021 నాటికి వీటిలో కూడా 8,70,000 ఉద్యోగాలు వస్తాయని సర్వే నివేదికలో పేర్కొన్నారు. టెక్నాలజీకి తగ్గ నైపుణ్యాలు సంపాదించిన వారు ఇన్‌ఫ్రా, సైబర్ భద్రత నిపుణులుగా రాణించవచ్చని వీరికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని సర్వే చెబుతోంది.
అప్లికేషన్ డెవలపర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు, హ్యాండ్‌సెట్ టెక్నిషియన్స్ వంటి విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న వారి అవసరం అధికంగా ఉంటుందట. ప్రస్తుత టెక్నాలజీలో పనిచేస్తున్న వారు మారుతోన్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందేనని సర్వేలో పేర్కొన్నారు. టెలికాం రంగంలో అవసరమయ్యే నైపుణ్యాలతో పాటు అందులో ఉన్న డిమాండ్ కోసం టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. సబ్‌స్ర్కైబర్‌ల పరంగా సమ్మేళన వార్షిక వృద్ధి రేటులో ఈ రంగం 19.6 శాతం వృద్ధిని నమోదుచేయగా, రెవెన్యూ పరంగా గత కొన్నేళ్లలో ఈ వృద్ధి 7.07 శాతంగా ఉంది.