: ఇండియా, చైనా మధ్య ఏ క్షణమైనా యుద్ధం: ఫారిన్ మీడియా
ఇండియా, చైనాల మధ్య సరిహద్దు వివాదం రోజురోజుకూ పెరుగుతోందని, ఈ రెండు దేశాల మధ్యా ఏ క్షణమైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఫారిన్ మీడియా హెచ్చరిస్తోంది. గడచిన రెండు నెలలుగా హిమాలయాల ప్రాంతంలోని డోక్లామ్ రీజియన్ లో ఇరు దేశాలూ సైన్యాన్ని మోహరించాయని, ఉద్రిక్తతలను సద్దుమణిగేలా చేసేందుకు ఇప్పటివరకూ చర్చలు ప్రారంభం కాలేదని, సమస్యకు కారణం మీరంటే మీరని రెండు దేశాలూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నాయని 'ది వాషింగ్టన్ పోస్ట్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ ప్రాంతం తమదంటే, తమదని రెండు దేశాలూ వాదిస్తున్న విషయాన్నీ ప్రస్తావించింది. వెనక్కు తగ్గేందుకు ఏ దేశమూ సుముఖంగా లేదని, ఏక్షణమైనా సైనికుల మధ్య కాల్పులతో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. చైనాతో సుమారు 2,220 కిలోమీటర్ల సరిహద్దులను భారత్ పంచుకుంటుండగా, గడచిన 50 సంవత్సరాల కాలంలో, సరిహద్దుల్లో ఒక్క తుపాకీ కూడా పేలలేదని, ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని అంచనా వేసింది. భారత్, చైనాల మధ్య స్నేహబంధం, గత మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత సంక్లిష్ట స్థితికి చేరిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నట్టు 'ది వాషింగ్టన్ పోస్టు' పేర్కొంది.