: రేప్ కేసులో 14 ఏళ్లు జైల్లో ఉన్నాడు.. బయటకొచ్చి మళ్లీ అదే పని చేశాడు!
14 ఏళ్ల జైలు శిక్షను అనుభవించినా ఈ కామాంధుడిలో ఎలాంటి పరివర్తన రాలేదు. వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా జలాల్ పూర్ ప్రాంతానికి చెందిన లాహుదేవరాం పవార్ గతంలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపి ఇటీవలే విడుదలయ్యాడు. అయినా అతనిలో ఎంతమాత్రం మార్పు రాలేదు.
తాజాగా, తన బంధువైన ఐదేళ్ల పాపకు చాక్లెట్ కొనిస్తానని తీసుకెళ్లి, ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు. రక్తస్రావమవుతున్న ఆ చిన్నారిని చూసి చుట్టుపక్కల వారు, బంధువులు షాక్ కు గురయ్యారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారి చెప్పిన సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని పింపాల గ్రామంలో పట్టుకున్నారు. ఆ కామాంధుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. మరోవైపు, ఈ ఘటన సంచలనం రేపుతోంది. 14 ఏళ్ల జైలు శిక్షను అనుభవించినా అతనిలో మార్పు రాలేదంటూ జనాలు మండిపడుతున్నారు. ఈ కామాంధుడిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.