: మరెవరూ నాలా చేయవద్దు... కొడుకు శాశ్వతంగా దూరమైన తరువాత తప్పు తెలుసుకున్న తండ్రి!


24 సంవత్సరాలు కంటికి రెప్పలా పెంచుకున్న కొడుకు దూరమైన తండ్రిలో ఎంత బాధ ఉంటుందో సురేష్ బన్సాల్ ను చూస్తే తెలుస్తుంది. కొడుకు అడిగాడు కదా అని ఎనిమిది నెలల క్రితం బినెల్లీ టీఎన్టీ 600ఐ సూపర్ బైక్ ను ప్రేమగా కొనిస్తే, అదే ఇప్పుడు ఆయన కుమారుడిని దూరం చేసింది. ఢిల్లీలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన సురేష్ బన్సాల్, ఇప్పుడు కొడుకు పోయిన బాధలో ఉన్నారు.

 "నేను ఆ బైక్ ను కొనిచ్చి ఎనిమిది నెలలే అయింది. నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు తెలుస్తోంది. మరే తల్లిదండ్రులూ ఈ తప్పు చేయవద్దు. దేశంలో అసలు సూపర్ బైక్ లన్నింటినీ నిషేధించాలి" అని ఆయన అన్నారు. కాగా, ఢిల్లీ వీధుల్లో తన బైక్ పై 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ, ఓ పాదచారిని తప్పించే క్రమంలో అదుపుతప్పిన హిమాన్షు బన్సాల్ బైక్, డివైడర్ ను ఢీకొనగా, తీవ్ర గాయాలతో అతను మృతి చెందిన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదం తరువాత సురేష్ బన్సాల్ స్పందిస్తూ, ఇండియాలో రహదారులు సూపర్ బైక్ లను నడిపేందుకు అనువుగా లేవన్న సంగతి తనకు తెలిసొచ్చిందని, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోయారు. కన్నాట్ ప్లేస్ నుంచి సెంట్రల్ ఢిల్లీకి తన ఇద్దరు స్నేహితులతో కలసి బైక్ రేస్ పెట్టుకున్న హిమాన్షు వేగంగా వెళుతూ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ఈ ముగ్గురి రేస్ దృశ్యాలు అక్కడి ఎన్నో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

  • Loading...

More Telugu News