: భారత్ లో అక్రమ చొరబాటుపై స్పందించిన చైనా... తమకేం తెలియదని వ్యాఖ్య
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నిన్న లడఖ్ ప్రాంతంలోకి ప్రవేశించడానికి యత్నించగా భారత సైన్యం వారి చొరబాటును తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన చైనా.. దీనిపై తమకు అసలు సమాచారం లేదని వ్యాఖ్యానించింది. సరిహద్దుల వెంబడి శాంతి, సుస్థిరతకు తాము కట్టుబడి ఉంటామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హు చున్యింగ్ చెప్పుకొచ్చారు. తమ భూభాగం వైపు వాస్తవాధీన రేఖ వెంబడే తమ బలగాలు ఎప్పుడూ గస్తీ తిరుగుతుంటాయని అన్నారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖపై ఉన్న ఒప్పందాలపై తాము కట్టుబడి ఉన్నామని, భారత్ కూడా కట్టుబడి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.