: మేం కట్టబోయే ఒక్క ఇల్లు, 8 ఇందిరమ్మ ఇళ్లతో సమానం: మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రూ. 18 వేల కోట్లు ఖర్చుపెడుతోందని, ఇంత డబ్బు ఖర్చు పెట్టి కట్టే ఒక్కో ఇల్లు, అప్పటి ప్రభుత్వం నిర్మిస్తామని చెప్పిన 8 ఇందిరమ్మ ఇళ్లతో సమానమని మంత్రి కేటీఆర్ అన్నారు. కొంపల్లిలో మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక జలమండలి ముందు ధర్నా చేసేవారు కనిపించడం లేదని, హైద్రాబాద్ నగరవాసుల దాహార్తిని తీర్చడానికి గతంలో పరిపాలించిన వారు ఒక్కసారి కూడా ఆలోచించలేదని ఆయన పేర్కొన్నారు.
అలాగే నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న తాగునీటి సౌకర్యాలను, అందుకు సంబంధించిన అభివృద్ధి పథకాలను ఆయన ప్రస్తావించారు. హైద్రాబాద్ కోసం ప్రత్యేకంగా జల సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అలాగే తమ ప్రభుత్వం చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల విజయాల గురించి ఆయన కొనియాడారు.