: "నే అడుగెడితే... షో మొదలెడితే... గుండీలు తీసి కాలర్ ఎగురేస్తే".. అంటూ హుషారెత్తించిన బాలయ్య!
టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని 'పైసా వసూల్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన పూరీ జగన్నాథ్...స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టైటిల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సోషల్ మీడియా ద్వారా విడుదలైన ఈ టైటిల్ సాంగ్ ప్రోమో బాలయ్య అభిమానులను అలరిస్తోంది.
గ్రేస్, ఎనర్జీతో బాలయ్య ఇందులో మాంచి హుషారుగా వున్నారు. 'నే అడుగెడితే.. షో మొదలెడితే.. అరె గుండీలు తీసి కాలరు ఎగరేస్తే..' అంటూ సాగే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటలో బాలయ్య హుషారు చూస్తుంటే ధియేటర్లు కేరింతలతో మార్మోగిపోవడం ఖాయమని అనిపిస్తోందని అభిమానులు పేర్కొంటున్నారు. భవ్య క్రియషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రియ, కైరాదత్ నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది.