: సమాంతరంగా గొయ్యి తవ్వుతూ సహాయకచర్యలు... బయల్దేరిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది... గ్రామం మొత్తం బావి దగ్గరే!
గుంటూరు జిల్లా వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మిడివరంలో రెండేళ్ల బాలుడు చంద్రశేఖర్ బోరుబావిలో పడిపోయిన సంగతి తెలిసిందే. పొలంలో సుమారు 200 అడుగుల లోతులో వేసిన బోరు బావి నిరుపయోగంగా మారడంతో దానిపై గోనెపట్టా కట్టి, గడ్డి పడేశారు. ఆ గడ్డిపై ఆడుకునేందుకు ప్రయత్నించిన చంద్రశేఖర్ బోరుబావిలో పడిపోయినట్టు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాలుడు పడిన బోరుబావిలో తాడు వేసి 20 అడుగుల లోతులో కదులుతున్నట్టు గుర్తించారు. బావిలో వున్న బాలుడికి ఆక్సిజన్ అందేలా.. చేటతో పైనుంచి విసురుతున్నారు. అలాగే పిల్లాడు భయపడకుండా ఉండేందుకు టార్చ్ లైట్ తో వెలుగును పంపే ప్రయత్నం చేస్తున్నారు.
బావిపై నుంచి తల్లి పిల్లాడికి ధైర్యం చెప్పే ప్రయత్నంలో ఉంది. అలాగే రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దానితో ఆగకుండా పక్కనే జేసీబీతో సమాంతరంగా బావి తవ్వడం ప్రారంభించారు. గ్రామస్థులంతా తలో చేయివేసేందుకు, చంద్రశేఖర్ ను కాపాడుకునేందుకు కదిలారు. ఇంతలో రెవెన్యూ అధికారులు కూడా వచ్చి, ఉన్నతాధికారులకు సమాచారమందించి, ఎన్డీఆర్ఎఫ్ దళాల సహాయం కోరారు. నిపుణులను కూడా రప్పించాలని కోరారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలికి బయల్దేరారు. గ్రామస్థులంతా బాలుడి కోసం ప్రార్థనలు చేస్తున్నారు.