: మరోసారి ప్రొటోకాల్ ను పక్కన పెట్టిన మోదీ... ఉరుకులు పెట్టిన సెక్యూరిటీ సిబ్బంది!
ఈ ఉదయం ఎర్రకోట వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రొటోకాల్ ను పక్కన పెట్టడంతో, సెక్యూరిటీ సిబ్బంది ఉరుకులు పెట్టాల్సి వచ్చింది. తన ప్రసంగం ముగిసిన తరువాత, వేదిక దిగి కిందకు వచ్చిన మోదీ, అక్కడే ఉండి జాతీయ గీతాలను పాడి ఆహూతులను అలరించిన చిన్నారుల మధ్యకు వచ్చారు. ఆనందంగా వారిని పలకరించి ప్రేమను కురిపించారు. చిన్నారులు సైతం మోదీతో ఫోటోలు దిగాలన్న ఉత్సాహాన్ని చూపించారు.
నిన్ననే కృష్ణాష్టమి పర్వదినాన్ని జరుపుకున్న పలువురు చిన్నారులు కృష్ణుని వేషంలోనే ఎర్రకోట వద్దకు రాగా, వారిని మోదీ పలకరించారు. చిన్నారుల మధ్యకు మోదీ వెళ్లిన వేళ, సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టిన పిల్లలను అదుపు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఆపై అందరికీ అభివందనం చేస్తూ, మోదీ తన వాహనం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, గతంలో పలు దేశాల అధ్యక్షులు భారత్ కు వచ్చిన వేళ, స్వాతంత్ర్య దినోత్సవాలు, ఎన్నికల బహిరంగ సభలు జరిగినప్పుడు మోదీ ప్రొటోకాల్ నిబంధనలు పక్కన బెట్టిన సంగతి తెలిసిందే.