: రైళ్లలో ఇకపై ఉచితంగా సినిమాలు, వీడియోలు!
దేశంలోని సుమారు మూడువేల రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా సినిమాలు, వీడియోలు చూసుకునే సౌకర్యాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే వయాకామ్18, జీ, హంగామా, షెమారూ వంటి వీడియో ప్రొవైడర్స్ తో ప్రభుత్వం చర్చలు జరిపినట్లు తెలిసింది. ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఆయా సైట్లలోకి లాగిన్ అయి అన్ని భారతీయ భాషల్లో సినిమాలు, వీడియోలను చూడవచ్చు. ప్రయాణికుల కోసం ఇప్పటికే దేశంలోని అనేక రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలను కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అయితే, ఆ సౌకర్యం రైల్వే స్టేషన్లలో ఉన్నప్పుడే ప్రయాణికులు పొందుతారు.
కాగా, రైళ్లలో ప్రయాణికులకు సినిమాలు, వీడియోల సౌకర్యాన్ని అందించేందుకు కొన్ని సంస్థలు బిడ్స్ వేసేందుకు ఆసక్తి చూపించాయని సంబంధిత అధికారులు చెప్పారు. సుమారు 24 కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. ఆయా సంస్థల నుంచి వార్షిక లైసెన్స్ ఫీజు వసూలు చేస్తామని, దీని ద్వారా రైల్వేకు సుమారు రూ.500కోట్లు ఆదాయం లభించవచ్చని చెబుతున్నారు. ఈ సౌకర్యాలను అందించడం కోసం ప్రతి కోచ్‌లోనూ ఓ డిస్ట్రిబ్యూషన్ బాక్స్‌ను ఇన్‌స్టాల్ చేసి, అందులోని సమాచారాన్ని ప్రతిరోజు అప్‌డేట్ చేస్తారు.