: ఉత్తర కొరియా నుంచి ఇనుము దిగుమతులపై చైనా నిషేధం!
ఐక్యరాజ్యసమితి ఆంక్షల మేరకు ఉత్తర కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఇనుము, సముద్ర ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర కొరియా అణు పరీక్షల కార్యక్రమానికి వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న ఒత్తిడి మేరకు చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం నుంచి ఇనుము, బొగ్గు, సముద్ర ఆహార పదార్థాలను ఉత్తర కొరియా నుంచి దిగుమతి చేసుకోబోయేది లేదని చైనా తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌ల మధ్య వాగ్యుద్ధం జరిగిన కొద్దిరోజులకే చైనా ఇలాంటి ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా ఆర్థికంగా బలపడటానికి దిగుమతుల ద్వారా చైనా పరోక్షంగా సహాయ పడుతోందని అమెరికా చేసిన ఆరోపణలతో ఐక్యరాజ్యసమితి దిగుమతులపై నిషేధించాలని ఆదేశించింది. ఈ మేరకు త్వరలోనే దిగుమతులు నిలిపివేస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.