: శ్రీలంకపై ఘన విజయం.. 85 ఏళ్ల టెస్టు చరిత్రలో విదేశాల్లో తొలిసారి టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్!
పల్లెకెలె టెస్టులో టీమిండియా విజయ దుందుభి మోగించింది. మొదటి, రెండవ టెస్టుల్లోనూ గెలిచిన భారత్ చివరిటెస్టులోనూ గెలవడంతో విదేశీ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన రికార్డును సాధించింది. ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 85 ఏళ్ల టెస్టు చరిత్రలో విదేశాల్లో భారత్ తొలిసారి టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసినందుకు టీమిండియా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.
రెండవ ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక నిన్నే రెండు వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ రోజు 19/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక జట్టు భారత్ బౌలర్లు అశ్విన్ (4 వికెట్లు), మహ్మద్ షమీ (3 వికెట్లు) ధాటికి ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయ్యారు. మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 487 పరుగులు చేసిన విషయం తెలిసిందే. శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 135 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అశ్విన్ 4, షమీ 3, ఉమేశ్ యాదవ్ 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్లు పడగొట్టారు.