: కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత నాదే!: చంద్రబాబు నాయుడు
కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత తనదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఈ రోజు నిర్వహించిన కాపుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాపులు కోరుతున్న రిజర్వేషన్ల అంశానికి వీలైనంత త్వరలోనే పరిష్కారం చూపిస్తానని అన్నారు. అలాగే కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే నేపథ్యంలో వెనుకబడిన తరగతుల వారికి ఉన్న రిజర్వేషన్లలో ఎక్కడా అన్యాయం జరగకుండా చూసుకుంటానని అన్నారు. తాను ఉన్నంత వరకు కాపులకు అన్యాయం జరగదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు ఇంకా పరిష్కారం కాలేదని అన్నారు.
కొందరు కాపుల ప్రయోజనాలు అంటూ మాట్లాడుతున్నారని, మరి వారు ఇటీవల ప్రకటించిన మానిఫెస్టోలో కాపుల అంశం గురించి ఎందుకు పెట్టలేదని చంద్రబాబు నిలదీశారు. తాను నిత్య విద్యార్థినని, సమాజ స్థితిగతుల గురించి అనునిత్యం నేర్చుకుంటున్నానని అన్నారు. తాను చదువుకుంటున్న రోజుల నుంచే సామాజిక న్యాయం గురించి మాట్లాడేవాడినని అన్నారు. సామాజిక న్యాయం విషయంలో ఎక్కడా వెనుకంజ వేయబోనని తెలిపారు. అన్ని వర్గాల వారిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.