: కరెంటు బిల్లు చూసిన సెలూన్ యజమానికి కళ్లు బైర్లు కమ్మాయి!
గత నెల వినియోగించిన విద్యుత్ కు వచ్చిన బిల్లును చూసిన హెయిర్ కటింగ్ సెలూన్ యజమాని కళ్లు బైర్లుకమ్మిన ఘటన హైదరాబాదు శివార్లలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన ముత్తంగి గ్రామంలో శ్రీనివాస్ అనే వ్యక్తి చిన్న హెయిర్ కటింగ్ సెలూన్ పెట్టుకని జీవనం సాగిస్తున్నాడు. ఆయన ఇంతవరకు విద్యుత్ బిల్లుగా కనిష్ఠంగా 200 రూపాయలు, గరిష్ఠంగా 1000 రూపాయలు చెల్లించేవాడు. అలాగే జూన్ నెల విద్యుత్ వినియోగానికిగాను వచ్చిన విద్యుత్ బిల్లు 971 రూపాయలను జూన్ 28న చెల్లించాడు.
జూలైకి సంబంధించిన బిల్లు ఈ నెల 10న వచ్చింది. దానిని చూసిన శ్రీనివాస్ షాక్ తిన్నాడు. ఎందుకంటే, అది అక్షరాల 1.27 లక్షల రూపాయల బిల్లు. దీంతో కళ్లు బైర్లు కమ్మిన అతను తన విద్యుత్ మీటర్ నంబర్ 0558 02239తో వచ్చిన 1,27,751 రూపాయల బిల్లు పట్టుకుని విద్యుత్ అధికారులను కలవగా వారు 'సంగారెడ్డిలో నిర్వహించే లోక్ అదాలత్ లో సమస్య చెప్పుకో' అంటూ ఉచిత సలహా ఇచ్చారు తప్ప, సమస్యను మాత్రం పట్టించుకోకపోవడం విశేషం.