: 15 మందిని పొట్టనపెట్టుకున్న ఏనుగు... దాని అంతు చూసిన హైదరాబాదీ షూటర్!
వరుసబెట్టి కనిపించిన ప్రతి ఒక్కరి ప్రాణాలను బలితీసుకుంటున్న మదగజాన్ని షూటింగ్ లో ఆరితేరిన హైదరాబాదీ వ్యక్తి కాల్చి చంపాడు. శనివారం ప్రపంచ ఏనుగుల దినోత్సవం కాగా, దానికంటే ముందు రోజు రాత్రి ఈ ఏనుగు ఆయువు తీరిపోయింది. ఇది బీహార్ రాష్ట్రంలో గత నెల మార్చిలో గుంపు నుంచి వేరుపడిపోయింది. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రంలోని అడవుల్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి కనిపించిన వారిపై దాడులు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు 15 మంది పౌరులు దీని వల్ల ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఈ ఏనుగును పట్టుకునేందుకు అక్కడి అటవీ శాఖ ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు వారం రోజుల పాటు ప్రయత్నాలు చేసినా సఫలం కాకపోవడంతో కాల్చి చంపాలని అటవీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాల్చడంలో నిపుణుడిగా పేరొందిన హైదరాబాదీ షూటర్ నవాబ్ షఫత్ అలీ ఖాన్ కు కబురు పెట్టారు. ఖాన్ రంగంలోకి దిగడం, దాన్ని కాల్చి పారేయడం జరిగిపోయాయి. ఏనుగు తన దంతంతో పొడిచిందంటే ప్రాణం పోయినట్టేనని, ఇది చాలా ప్రమాదకరమైన ఆపరేషన్ అని ఖాన్ పేర్కొన్నాడు. ఈ ఆపరేషన్ లో అటవీ అధికారులు, గ్రామస్తులు 100 మంది వరకూ పాల్గొన్నారు.