: ఇకపై మనకు ఎలాంటి పిల్లలు కావాలంటే అలాంటి పిల్లలు .. డిజైనర్ బేబీస్!
పెద్ద కళ్లు, కొటేరు లాంటి ముక్కు, చిన్న మూతి.. ఇలా అందంగా ఉండే పిల్లలు పుట్టాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజమే. అయితే, వారు కోరుకున్నంత మాత్రాన అంతే అందంతో పిల్లలు పుడతారా? అనే అనుమానం ఎవరికైనా తలెత్తకమానదు. దీనికి.. ‘అవును’ అనే సమాధానాన్ని తాజా పరిశోధన చెబుతోంది. అమెరికా నిపుణులు చేపట్టిన పరిశోధనలో ఈ విషయం వెల్లడవడం విశేషం.
మరో విశేషమేమిటంటే, ఈ పరిశోధనలో మన దేశానికి చెందిన కశ్మీర్ వాసి సంజీవ్ కౌల్ కూడా పాలుపంచుకోవడం. జన్యు సవరణలతో ఓ పిండాన్ని తొలిసారిగా వీరు అభివృద్ధి చేశారు. వ్యాధి కారక జన్యు పరివర్తనలను జన్యు సవరణ పరిజ్ఞానం సాయంతో పరిశోధకులు విజయవంతంగా తొలగించారు. ఈ పరిశోధన ఫలితంగా భవిష్యత్తు తరాలకు ఈ ప్రమాదకర జన్యువులు సంక్రమించేందుకు వీలు లేకుండా చేశారు.
అంతేకాకుండా, మరో కీలక అవరోధాన్నీ ఈ పరిశోధన ద్వారా అధిగమించారు. జన్యు సవరణ అనంతరం పిండంలోని కొన్ని కణాల్లో ఇంకా వ్యాధి కారక పరివర్తనలు ఇది వరకు కనిపించేవి. తాజా పరిశోధనలో వీటిని లేకుండా చేయగలిగారు. అయితే, ఈ పరిశోధన ద్వారా పూర్తిగా డిజైనర్ బేబీస్ (కోరుకునే లక్షణాలతో పుట్టే పిల్లలు) సాధ్యం కాకపోయినప్పటికీ మొదటి అడుగు పడినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ పరిశోధనలో క్లస్టెర్డ్ రెగ్యులర్లీ ఇంటెర్ స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్ (క్రిస్పార్ క్యాస్-9) సాంకేతికతను ఉపయోగించారు. ఇది గుండెపోటుకు కారణమయ్యే ప్రాణాంతక పరివర్తనలను పూర్తిగా తొలగించడంతో క్రియాశీలకంగా పని చేసింది. ఓ మానవ పిండంపై ఈ తరహా పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి ఈ పిండాలను మానవుల్లో ప్రవేశపెట్టడం లేదని ఈ పరిశోధనలో పాల్గొన్న అమెరికా, దక్షిణకొరియా, చైనా నిపుణులు తెలిపారు. ఈ పిండాల్లో కొన్నింటిని మరికొన్ని రోజులు పెరగనిస్తామని, పిండాల్లో వ్యాధి కారక జన్యువులను తాము గుర్తించి, సమర్థంగా సవరించగలిగామని చెప్పారు.