: ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షకు సిద్ధం!
ఉత్తర కొరియా మరో దుందుడుకు చర్యకు సిద్ధమైంది. జలాంతర్గామి ఆధారిత బాలిస్టిక్ మిసైల్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. గతేడాది ఆగస్టులో పరీక్షించిన పగ్‌గుక్‌సంగ్-1 క్షిపణిని సరికొత్తగా తీర్చి దిద్దే ఉద్దేశంతో ఈ మిసైల్‌ను మరోమారు పరీక్షించేందుకు సిద్ధమైందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఉత్తర కొరియాల మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తాజా చర్య ద్వారా ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్న విషయం ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడైంది. మరోవైపు ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన విధంగా బుద్ధిచెబుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.