: నేడు పెళ్లి చూపులు... రాత్రి బెంగళూరులో ఎక్కిన బస్సు ఇంకా హైదరాబాదు చేరలేదు... ప్రయాణికులకు మార్నింగ్ 'స్టార్స్'!
నిన్న రాత్రి బెంగళూరులో బయలుదేరిన ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ 'మార్నింగ్ స్టార్'కు చెందిన బస్సు, తెల్లవార్లూ ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఆర్టీయే అధికారుల తనిఖీల భయంతో దాదాపు ఏడు గంటల పాటు బెంగళూరు చుట్టూ తిరిగి తెల్లారేసరికి హౌస్ పేట సమీపానికి బస్సు చేరుకుని నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం 10 గంటల సమయంలోనూ బస్సు అక్కడే ఉంది.
తనకు నేడు పెళ్లి చూపులని, రాత్రి బస్సెక్కితే, ఇప్పటికీ హైదరాబాద్ కు చేరకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బస్సులోని ఓ యువతి వాపోయింది. ఇక ఇద్దరు చిన్న పిల్లలతో బస్సెక్కిన మరో మహిళ, తమను ట్రావెల్స్ సంస్థ మోసం చేసిందని, అనుమతులు లేని బస్సును నడుపుతూ, రాత్రంతా ప్రయాణించినా, 100 కిలోమీటర్ల దూరం కూడా తీసుకు రాలేదని, ఇక ఇప్పుడు బస్సు బయలుదేరినా హైదరాబాద్ చేరేసరికి రాత్రి అవుతుందని పేర్కొంది. యాజమాన్యం ప్రయాణికులకు చుక్కలు చూపించిందని, తాము ఎన్నిమార్లు పరిస్థితిని వివరించాలని ఫోన్ చేసినా స్పందించలేదని ఇతర ప్రయాణికులు నిప్పులు చెరిగారు.