: తనపై సుప్రీంకోర్టు వేసిన అనర్హత వేటును జోక్‌గా అభివర్ణించిన పాక్ మాజీ ప్రధాని షరీఫ్!
తనపై సుప్రీంకోర్టు వేసిన అనర్హత వేటును పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ‘జోక్’గా అభివర్ణించారు. ప్రజలు వేసిన ఓటు చాలా విలువైనదని, అందరూ తనకు అండగా నిలబడాలని కోరారు. పనామా పేపర్స్ కుంభకోణంలో ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు బయలుదేరిన ఆయన మూడో రోజు గుజరాత్ (పాకిస్తాన్ లోని ఓ నగరం)లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనపై అనర్హత వేటు వేసిన న్యాయమూర్తులు తనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక్క ఉదాహరణ కూడా చూపించలేకపోయారన్నారు. ఈ జోక్‌ను తాను అంగీకరించడం లేదని, మీరు ఎన్నుకున్న వ్యక్తిని అవమానించి పంపిస్తే మీరు అంగీకరిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. అసలు తనను ఎందుకు తొలగించారని, తానేమైనా అవినీతికి పాల్పడ్డానా? అని షరీఫ్ నిలదీశారు. తాను అమాయకుడినని, తానెటువంటి తప్పు చేయలేదన్నారు.
కాగా, షరీఫ్ రోడ్ షోకు ప్రజలు పోటెత్తారు. రోడ్డుకు ఇరువైపులా అభిమానులు పెద్ద ఎత్తున నిలబడి స్వాగతం పలికారు. దీంతో పంజాబ్ హౌస్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావల్పిండికి చేరుకునేందుకు షరీఫ్‌కు 12 గంటలు పట్టింది.