: టాయిలెట్ కట్టుకోమని ప్రభుత్వం డబ్బులిస్తే... స్మార్ట్ ఫోన్ కొనుక్కున్న ప్రబుద్ధుడు!
స్వచ్ఛ భారత్ స్థాపనలో భాగంగా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు టాయిలెట్లను నిర్మించుకునేందుకు ప్రభుత్వం డబ్బులిస్తుంటే, వాటిని దుర్వినియోగం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. జార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లా భూలి పట్టణానికి చెందిన రాజేశ్ మహతో కూడా ఇదే పని చేశాడు. ఇంట్లో శౌచాలయం నిర్మాణం కోసం మునిసిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు కాగా, ఆ డబ్బుతో స్మార్ట్ ఫోన్ ను కొనుక్కొని భార్యతో తిట్లు తిన్నాడు.
డబ్బులు వచ్చినా టాయిలెట్ ను ఎందుకు కట్టించడం లేదని అతని భార్య లక్ష్మీదేవి నిలదీసేసరికి అసలు విషయాన్ని చెప్పాడు. దీంతో కోపంతో ఆ స్మార్ట్ ఫోన్ ను నేలకేసి కొట్టిన ఆమె, టాయిలెట్ కట్టిన తరువాతే ఇంట్లోని వారు ఫోన్లు వాడాలని నిబంధన పెట్టి, నిరాహారదీక్షకు దిగింది. దీంతో తన తప్పు తెలుసుకున్న రాజేశ్, అప్పు తెచ్చి మరీ మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించాల్సి వచ్చింది.