: మొట్ట మొదటిసారిగా దేశంలోని నాలుగు అత్యున్నత పదవుల్లో బీజేపీ నేతలు!
కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని వినిపిస్తూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ అదే లక్ష్యంతో దూసుకుపోతోంది. ఈ రోజు బీజేపీ నేత వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయడంతో రాజ్యాంగబద్ధ ఉన్నత హోదాలయిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ పోస్టుల్లో నలుగురు నేతలూ బీజేపీకి చెందిన వారే ఉన్నారు. మరోవైపు రామ్‌నాథ్ కోవింద్, వెంకయ్య నాయుడు, నరేంద్ర మోదీ.. ఈ ముగ్గురూ ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారే.
2019 ఎన్నికల్లోనూ విజయం సాధించి బీజేపీ ఈ ట్రెండ్‌ను సాగిస్తూ పోవాలని యోచిస్తోంది. కాగా, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ భారతీయ జనతా పార్టీకి చెందిన నేతే అయినప్పటికీ, రాజ్యసభలో కీలకమైన డిప్యూటీ ఛైర్మన్ పదవిలో కాంగ్రెస్ కు చెందిన పీజే కురియన్ ఉన్నారు. ఆ పదవిలో ఆయన ఆగస్టు 21, 2012 నుంచి కొనసాగుతున్నారు. ఆ పదవిలోనూ తమ పార్టీ నేతను కూర్చోబెట్టి క్లీన్ స్వీప్ చేయాలని బీజేపీ ఇప్పుడు భావిస్తోంది.
వాజ్‌పేయి హయాంలో (1998-2004) లోనూ ఈ నాలుగు టాప్ పోస్టుల్లో బీజేపీ నేతలు కనిపించలేదు. మోదీ హయాంలో మాత్రం ఈ నాలుగు అత్యున్నత పదవుల్లో బీజేపీ నేతలే సుదీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది. 1977 కి ముందు వరకు ఈ నాలుగు రాజ్యాంగబద్ధ అత్యున్నత పదవుల్లో కాంగ్రెస్ నేతలే ఉండేవారు. మొరార్జీ (జనతా పార్టీ) ప్రభుత్వం వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అందులోని రెండు పదవులను కోల్పోయింది.
వాజ్‌పేయి హయాం తరువాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ నాలుగు అత్యున్నత పదవుల్లో తమ పార్టీ నేతలను ఉంచలేకపోయింది. ఆ పార్టీ రెండవ సారి (2009-2014) అధికారంలోకి వచ్చిన సమయంలో మాత్రం ఈ నాలుగు పదవులను కాంగ్రెస్ పార్టీకి నేతలే అధిష్ఠించారు.