: కేసీఆర్ సభలో కలకలం రేపిన సర్పంచ్ భర్త.. భారీ కటౌట్ పైకెక్కి బెదిరింపు!
పోచంపాడులో గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న సభలో ఓ సర్పంచ్ భర్త, మరో మహిళ కలకలం రేపారు. సభా వేదిక పక్కన ఉన్న వంద అడుగుల భారీ కటౌట్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ముఖ్యమంత్రి ప్రసంగం ముగింపు దశకు చేరుకుంటున్న దశలో ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం గంగాపూర్ సర్పంచ్ అరెంపల్లి శాంత భర్త చంద్రహాస్ కటౌట్ పైకెక్కి గ్రామంలోని సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రివైపు చూపించాడు. అయితే అతడిని ఏమాత్రం పట్టించుకోని సీఎం అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కటౌట్ పైనుంచే ఆయన గొడవకు దిగాడు.
అదే సమయంలో పోచంపాడుకు చెందిన విజయలక్ష్మి అనే మహిళ కూడా కటౌట్ పైకెక్కి తనకు ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమె కిందికి దిగినా సర్పంచ్ భర్త మాత్రం ససేమిరా అన్నాడు. గ్రామ సమస్యలపై అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందన్నాడు. దీంతో సీపీ కార్తికేయ ఆయనతో మాట్లాడి నచ్చజెప్పడంతో చంద్రహాస్ కిందికి దిగాడు.