: రూ. 900 చెల్లించండి... డైమండ్ సొంతం చేసుకోండి... త్వరలో మార్కెట్లోకి డైమండ్ బాండ్లు!
త్వరలో ప్రతి ఒక్కరికీ డైమండ్ సొంతం చేసుకునే కల నెరవేరబోతోంది. 30 నెలల పాటు నెలకు రూ. 900 చెల్లించి 30 సెంట్ల డైమండ్ సొంతం చేసుకునే అవకాశాన్ని త్వరలో సెబీ కల్పించబోతోంది. ప్రపంచంలో మొదటిసారిగా డైమండ్ బాండ్లను ప్రవేశపెట్టే యోచనలో సెబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి లావాదేవీలు మొదలుపెట్టమని ఇప్పటికే ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఐసీఈఎక్స్)కు ఆదేశాలు కూడా జారీచేసినట్లు సమాచారం. ఈ డైమండ్ బాండ్లలో భాగంగా 30 సెంట్లు, 50 సెంట్లు, 1 కేరెట్ బాండ్లను ఐసీఈఎక్స్ ప్రవేశపెట్టనుంది.
ఈ లెక్క ప్రకారం అతిచిన్నదైన 30 సెంట్ల డైమండ్‌ను సొంతం చేసుకోవడానికి నెలకు రూ. 900 చెల్లిస్తే సరిపోతుంది. ఇలా జరగాలి అంటే ముందు వినియోగదారుడు ఐసీఈఎక్స్‌లో అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత ట్రేడింగ్ బ్రోకర్ ద్వారా డీమ్యాట్ రూపంలో డబ్బు చెల్లించాలి. ఇలా ట్రేడింగ్ చేస్తూ వినియోగదారుల అకౌంట్‌లో 30 సెంట్లు జమయ్యాక డైమండ్ అతని చేతికొస్తుంది. ఇంకా పెద్ద డైమండ్ కావాలనుకుంటే అకౌంట్‌లో 50 సెంట్లు, 1 కేరెట్ జమ అయ్యే వరకు ట్రేడింగ్ చేస్తూనే వుండాలి. ఈ నెల చివర్లోగా ఈ డైమండ్ బాండ్లను అమల్లోకి తీసుకురానున్నారు.