: నా తండ్రి మరణించినప్పుడు జగన్ కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదు!: మంత్రి అఖిలప్రియ
భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నిక తేదీ దగ్గర పడుతుండడంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ నేతలు చేస్తోన్న విమర్శల పట్ల మంత్రి భూమా అఖిల ప్రియ ఘాటుగా స్పందించారు. తనపై, తన కుటుంబంపై విమర్శలు చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు తమ తల్లిదండ్రులు ఆ పార్టీని నిలబెట్టేందుకు ఎంతో కృషి చేశారని, దీక్షలు కూడా చేశారని ఆమె అన్నారు.
వైసీపీలో ఉన్నప్పుడు వారు మంచివారు, ఇప్పుడు చెడ్డవారా? అని అఖిలప్రియ ప్రశ్నించారు. తన తండ్రి మృతి చెందినప్పుడు జగన్ కనీసం సానుభూతి కూడా ప్రకటించలేదని ఆమె అన్నారు. తన తండ్రి మరణించిన తర్వాతి రోజే తాను అసెంబ్లీకి వెళ్లానని తనను వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని చెప్పిన ఆమె... తన తల్లి మరణించాక రెండోరోజే వైసీపీ తరపున ప్రచారం చేశానని అన్నారు. అప్పుడు ఒప్పుగా కనిపించింది, ఇప్పుడు తప్పుగా కనిపిస్తుందా? అని ఆమె నిలదీశారు.