: 18 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న 10 ఏళ్ల బాలుడి కథతో టీవీ సీరియల్.. నిషేధం విధించాలని స్మృతీ ఇరానీకి పిటిషన్!
విభిన్న కథాంశంతో ప్రసారమవుతున్న హిందీ సీరియల్ `పెహ్రేదార్ పియా కీ` సీరియల్‌పై కేంద్ర జౌళి శాఖ, సమాచార ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రైమ్ టైమ్‌లో వస్తున్న ఈ సీరియల్ పిల్లల ఆలోచనా విధానాలను మార్చే విధంగా ఉందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ పిటిషన్‌పై 36,282 మంది సంతకాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
ఈ సీరియల్లో అనివార్య కారణాల వల్ల పదేళ్ల బాలుడిని 18 ఏళ్ల యువతి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. బాలుడు అమ్మాయి నుదుట బొట్టు పెట్టడం, తనను ప్రేమిస్తున్నానని పదే పదే చెప్పడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా ఉంటున్నాయి. ఈ సీరియల్ ప్రారంభానికి ముందే వచ్చిన ప్రోమోలపై చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. కాకపోతే జూలై 17న ప్రారంభమైన ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ బాగుండటంతో టీఆర్పీ పెరిగిందని ఛానల్ వారు చెబుతున్నారు.