: నంద్యాలలో టీడీపీకి మద్దతు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్న పవన్ కల్యాణ్!
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడిన వేళ, అధికార తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికితే తనకు కలిగే లాభనష్టాలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీకి మద్దతిస్తే జనసేన పార్టీకి ప్లస్సా? మైనస్సా? అన్న విషయంలో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ ప్రచారం ఎంతగా ఉపకరించిందో అందరికీె తెలిసిందే. ఆయన లేకుంటే ఓటమి పాలయ్యే వారమని ఎన్నోసార్లు తెలుగుదేశం నేతలే వ్యాఖ్యానించారు.
ఆ తరువాత మారిన పరిస్థితుల నేపథ్యంలో పవన్, తన సొంత రాజకీయ పార్టీ జనసేనను మరింతగా విస్తృతం చేసుకుంటూ సాగుతున్నారు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ఆయన ముందుకు వెళుతున్నారు. గతంలో ఎన్నో బహిరంగ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో, విభజన హామీలను అమలు చేసేలా చూడటంలో టీడీపీ విఫలమైందని పవన్ తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
అయితే, ఇటీవలి కాలంలో ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య, పవన్ ను, చంద్రబాబును కొంత దగ్గర చేసింది. ఈ నేపథ్యంలో పవన్ ను మరోసారి దగ్గర చేసుకోవాలని చంద్రబాబు యోచిస్తున్నారు. అయితే, ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పవన్ భావిస్తున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. అందువల్లే ప్రస్తుతానికి ఆయన మౌనంగా ఉండిపోయారని అన్నారు.