: వెనక్కు తగ్గిన 9 మంది... నంద్యాల బరిలో మిగిలింది 15 మంది!
నంద్యాల ఉప ఎన్నికల ఘట్టం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిపోగా, మొత్తం 15 మంది రంగంలో ఉన్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. బుధవారం నాడు 9 మంది తమ నామినేషన్లను ఉపసంహరించనుకున్నారు. పోటీ పడే అభ్యర్థులు 16 మంది కన్నా ఎక్కువగా ఉంటే రెండో ఈవీఎం యంత్రాన్ని వాడాల్సి వుంటుంది. దీంతో ఎంతమంది తమ నామినేషన్లను వెనక్కు తీసుకుంటారో తెలియని స్థితిలో అటు అధికారుల్లో, ఇటు పార్టీల్లో కాసేపు ఆందోళన వ్యక్తమైంది. చివరకు 15 మందే బరిలో మిగలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇక తెలుగుదేశం పార్టీ తరపున భూమా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున శిల్పా చంద్ర మోహన్ రెడ్డి ప్రధానంగా పోటీ పడుతుండగా, కాంగ్రెస్ తరపున గడ్డం అబ్దుల్ ఖాదర్, బీసీ యునైటెడ్ ఫ్రంట్ తరపున గాజుల అబ్దుల్ సత్తార్, రాయలసీమ పరిరక్షణ సమితి తరపున భవనాశి పుల్లయ్య, సమాజ్ వాది పార్టీ నుంచి రాఘవేంద్ర, నవతరం పార్టీ నుంచి రావు సుబ్రహ్మణ్యం, రాజ్యాధికార పార్టీ నుంచి వల్లిగట్ల రెడ్డప్ప, అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున షేక్ మహబూబ్ బాషాలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పి.గురువయ్య, నాగనవీన్ ముద్దం, బాల సుబ్బయ్య. ఎ.భూపనపాటి నరసింహులు, ఎస్ రఘునాథరెడ్డి, సంగ లక్ష్మీకాంతరెడ్డి పోటీ పడుతున్నారు. ఈ నెల 23న ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.