: అధ్యక్షుడినయ్యాక నేను ఇచ్చిన తొలి ఆర్డర్ అదే!: ఉత్తరకొరియాను హెచ్చరించిన ట్రంప్
'అమెరికాలోని కీలక నగరాలన్నీ మా అధీనంలోకి వచ్చాయి.. అణుదాడి చేస్తా..' అంటూ పదేపదే ప్రకటనలు చేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. అమెరికా అధీనంలోని దీవిపై దాడి చేస్తామని ఉత్తరకొరియా చేసిన ప్రకటన అనంతరం ట్రంప్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇచ్చిన తొలి ఆర్డర్ ఏంటంటే... 'అమెరికా అణు ఆయుధశాలను ఆధునికీకరించాలన్నది' అని అన్నారు.
ఇప్పుడు అమెరికా అణు ఆయుధశాల మరింత శక్తిమంతంగా తయారైందని ఆయన చెప్పారు. అయితే ఆ అధికారాన్ని ఉపయోగించాలని తాను భావించడం లేదని, అది ఉపయోగించాల్సిన అవసరం కూడా రాకూడదని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. కాగా, అణుబాంబులకు సంబంధించిన కీలకమైన ఆదేశాలను నేరుగా అమెరికా అధ్యక్షుడే ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఆదేశాలు ఇచ్చిన తరువాతగానీ దాని ప్రయోగానికి పూనుకోరన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.