: 'భువనగిరి భాయ్' పేరు చెప్పగానే డబ్బులివ్వాలి.. లేదా ఖతం!: నయీం గ్యాంగ్ బెదిరింపులు
కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ నయీంను మట్టుబెట్టిన ఏడాది తరువాత అతని అనుచరులు తెరపైకి వచ్చారు. నయీం పేరుతో మళ్లీ దందా షురూ చేసినట్టు తెలుస్తోంది. హైదరాబాదులో వీరేశం అనే వ్యాపార వేత్తను వీరు బెదిరించారు. భువనగిరి భాయ్ పేరు చెబితే ఎవరైనా భయపడాల్సిందేనని వారు ఫోన్ ద్వారా బెదిరించారు. రాజేంద్రనగర్ లోని టీఎన్జీవో కాలనీలో భూమిని తమ పేరిట బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాసాగర్ తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి అని, ఎమ్మెల్యేలు, పోలీసులు, అధికారులను మార్చగలడని, అతని భార్య వస్తుందని, ఆమెతో కలిసి ఆ భూమి బదిలీ చేయించాలని సూచించారు.
విద్యాసాగర్ పేరు చెప్పినా పట్టించుకోవా? అంటూ బెదిరింపులకు దిగారు. లేదంటే ఆమెకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎక్కడున్నా ఐదు నిమిషాల్లో లేపేస్తామని హెచ్చరించారు. దీంతో బాధితుడు బెదిరింపులకు పాల్పడిన ఆడియో టేపుతో మైలార్ దేవ్ పల్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. గతంలో భువనగిరి భాయ్ పేరుతో నయీం దందాలు చేసేవాడని, ఇప్పుడు అతని పేరుతోనే దుండగులు సెటిల్మెంట్ లు చేస్తుండడంతో అతని అనుచరులు ఈ దందాకు తెరలేపారా? లేక నయాం పేరు చెప్పుకుని ఎవరైనా ఆ దురాగతాన్ని మొదలుపెట్టారా? అన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.