: 45వ భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా గురించి కొన్ని విషయాలు!
జస్టిస్ జె.ఎస్. ఖేహర్ స్థానంలో 45వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా నియామకమయ్యారు. ఆగస్టు 27 నుంచి ఈయన ఆ పదవిని స్వీకరిస్తారు. 14 నెలల పాటు ఈయన చీఫ్ జస్టిస్ గా పనిచేయనున్నారు. అక్టోబర్ 2, 2018న దీపక్ మిశ్రా పదవీ కాలం పూర్తి కానుంది. జస్టిస్ రఘునాథ మిశ్రా, జస్టిస్ జీబీ పట్నాయక్ల తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒడిశా నుంచి ఎంపికైన మూడో వ్యక్తి దీపక్ మిశ్రా.
ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన కొన్ని వివరాలు:
1953లో జన్మించిన దీపక్ మిశ్రా 1977, ఫిబ్రవరి 14న న్యాయవాద వృత్తి చేపట్టారు. ఒరిస్సా హైకోర్టు, సర్వీస్ ట్రైబ్యునల్‌లో పని చేశారు.
1996లో ఒరిస్సా హైకోర్టు అడిషనల్ జడ్జిగా పనిచేశారు. తర్వాత 1997లో మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు.
2009లో పాట్నా హైకోర్టు, 2010లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు.
ముంబై వరుస పేలుళ్ల నేరస్తుడు యాకుబ్ మెమన్ విన్నపాన్ని తిరస్కరించిన బెంచ్‌లో దీపక్ మిశ్రా ఉన్నారు. అలాగే నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన బెంచ్‌లో, సినిమా థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించాలని నిర్ణయించిన బెంచ్‌లోనూ ఆయన భాగస్వాములుగా ఉన్నారు. అంతేకాకుండా ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ ను వెబ్సైట్లో ఉంచాలని తెలిపిన ధర్మాసనంలోనూ, అయోధ్య స్థల వివాదం కేసు విచారణ బెంచ్ లోనూ ఈయన ఉన్నారు.