: నంద్యాల ఉప ఎన్నికను టీడీపీకి ఏకగ్రీవంగా వదిలేస్తే ఒక్క మంత్రి కూడా ఇక్కడకు వచ్చేవారు కాదు!: రోడ్ షోలో వైఎస్ జగన్
మీడియా లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపిస్తోందని, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వార్తలు రాస్తోందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు కర్నూలు జిల్లా కానాలలో ఆయన రోడ్ షోలో మాట్లాడుతూ... తనకు మీడియా తోడుగా ఉండకపోయినా ప్రజల ఆదరాభిమానాలతో ముందుకు వెళతానని అన్నారు. ‘నాకున్న ఆస్తి నాన్న గారి మీద మీకున్న అభిమానం, ఆయన అప్పట్లో అమలుచేసిన సంక్షేమ పథకాలను నేను అమలు చేయగలనన్న నమ్మకం, జగన్ మోసం చేయడనే విశ్వసనీయతే నా ఆస్తి, జగన్ అబద్ధమాడడు, మాటిస్తే తప్పడు, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాడు అని ప్రజల్లో ఉన్న నమ్మకమే నా ఆస్తి, నేను కూడా మా నాన్నగారిలాగే సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళతాననే నమ్మకం మీలో ఉండడం నాకు పెద్ద ఆస్తి’ అని జగన్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబులా అబద్ధాలు చెప్పడం తనకు చేతకాదని జగన్ అన్నారు. మూడేళ్లుగా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు, టీడీపీ మంత్రులు ఇక్కడి రోడ్లపై నడుస్తూ కనిపించారా? అని ఆయన ప్రశ్నించారు. తాము నంద్యాల ఉప ఎన్నికను టీడీపీకి ఏకగ్రీవంగా వదిలేస్తే ఒక్క మంత్రి కూడా ఇక్కడకు వచ్చేవారు కాదు అని అన్నారు. చంద్రబాబు నాయుడు నంద్యాల అభివృద్ధి మాటే ఎత్తేవాడుకాదని అన్నారు. మోసపూరిత మాటలు మాట్లాడుతున్న వారిని నమ్మకూడదని సూచించారు. టీడీపీ నేతలు గెలిచిన నియోజక వర్గాల్లో ఏ మాత్రం అభివృద్ధి జరగడం లేదని నంద్యాలలో మాత్రం ఇప్పుడు అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దారుణంగా మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని, ఇటువంటి పాలన మాకువద్దని చెప్పండని జగన్ అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో వేసే ఓటు టీడీపీకి బుద్ధి చెప్పేలా ఉండాలని అన్నారు. తాము అందరికి ఉపయోగపడేలా నవరత్నాలను ప్రకటించామని, అవి ప్రతి ఇంటికి చేరాలని అన్నారు.