: మరో రెండు వారాల్లో తెరపైకి రజనీకాంత్ పార్టీ.. జెండా, అజెండా ప్రకటన?
దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మళ్లీ వార్తలు ఊపందుకున్నాయి. మరో రెండు వారాల్లో రజనీ తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారని, అప్పుడే జెండా, అజెండాను కూడా ప్రకటిస్తారని గాంధేయ మక్కల్ ఇయక్కం అధ్యక్షుడు తమిళరువి మణియన్ పేర్కొన్నారు. ఇటీవల రజనీకాంత్‌ను రెండుసార్లు కలుసుకున్నటు చెప్పిన ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రజనీ మరో రెండు వారాల్లో ప్రజల మధ్యకు రానున్నట్టు తెలిపారు.
తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన ప్రజలకు ఏదైనా చేయాలనే గట్టి పట్టుదలతో రజనీ ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని, కాబట్టి తప్పకుండా వస్తానని చెప్పినట్టు వివరించారు. మరో రెండు వారాల్లో రజనీ పార్టీని ప్రకటిస్తారని తమిళరువి తెలిపారు. కాగా, ఇటీవల ‘కాలా’ చిత్రం షూటింగ్లో బిజీ అయిపోయిన రజనీ మళ్లీ రాజకీయాలపై దృష్టి సారించారు. ఇప్పటికే పలువురితో చర్చించినట్టు తెలుస్తోంది. అభిమానులతో రెండో విడత సమావేశం అనంతరం భారీ బహిరంగ సభకు రజనీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సభలో తన పార్టీని ప్రకటించనున్నట్టు సమాచారం.