: భారత్ ఎదుగుతున్న తీరుని చూసి చైనా ఓర్వలేకపోతోందట!


డ్రాగన్ కంట్రీ చైనా లక్ష్యం భారత్ కాదని, దాని వెనుక వేరే ఉద్దేశాలు వున్నాయని అమెరికా-చైనా మేధావి వర్గానికి చెందిన గ్లాసర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం డోక్లాం వివాదంపై చైనా వ్యూహాత్మక వైఖరిని ఆయన బట్టబయలు చేశారు. చైనా పదేపదే భారత్ బలగాలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించడం వెనుక కారణం ఏంటంటే... భారత్ ను ఒత్తిడిలో పడేయడమేనని అన్నారు. దాడి చేస్తామని ఓసారి, భారత్ సరిహద్దులు అతిక్రమించిందని మరోసారి... ఇలా పలురకాలుగా కథనాలు ప్రసారం చేయడం ద్వారా భారత్ ను ఒత్తిడిలో పడేసి, వెనక్కి తగ్గేలా చేస్తే చైనా విజయం సాధించినట్టుగా ప్రచారం చేసుకుంటుందని, భారతే తమపై దురాక్రమణకు దిగిందని ప్రపంచాన్ని నమ్మించవచ్చని చైనా భావిస్తోందని అన్నారు.

అదే సమయంలో భారత్ అంత పెద్ద దేశమే తమ ముందు తలవంచగా.. ఫిలిప్పీన్స్, మయన్మార్, జపాన్ వంటి దేశాలు తోకజాడించేందుకు భయపడేలా చేయవచ్చని చైనా అంచనా వేస్తోందని ఆయన చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా, జపాన్ దేశాలతో సన్నిహితంగా ఉండడాన్ని డ్రాగన్ కంట్రీ ఓర్చుకోలేకపోతోందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్ ఎదుగుతున్న తీరు కూడా చైనాకు ఈర్ష్య పుట్టిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ అతి త్వరలోనే ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్న విషయం చైనాకు తెలుసని ఆయన పేర్కొన్నారు. దీనిని చైనా జీర్ణించుకోలేకపోతోందని, అందుకే మోదీ తనను చిక్కుల్లో పడేస్తున్నారన్న భావనతో భారత్ తో వివాదాన్ని చైనా కోరుకుంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News