: బలవంతంగా మత్తులో ముంచుతూ వికృతత్వం: ఆక్సెంచర్ టెక్కీపై భార్య ఫిర్యాదు
తనకు అలవాటు లేదని ఎంతగా వారిస్తున్నా వినకుండా తన భర్త మద్యం తాగించి, ఆపై పడకగదిలో వికృతంగా ప్రవర్తిస్తూ, ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నాడని ఆక్సెంచర్ సంస్థలో లక్షల వేతనంపై పని చేస్తున్న ఓ మేనేజర్ పై ఆయన భార్య ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. బెంగళూరు విజయనగర పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫిర్యాదులోని వివరాల ప్రకారం, తన భర్త చెర నుంచి తనను రక్షించాలని ఆమె వాపోయారు.
చూడటానికి తన మాజీ లవర్ మాదిరిగా ఉన్నావని, అదే పేరుతో పిలుస్తానని, తనను చూస్తే ఆమే గుర్తుకు వస్తోందని మానసికంగా వేధిస్తున్నాడని ఆమె పేర్కొన్నారు. ఏడాది క్రితం ఓ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో చూసి అతన్ని వివాహం చేసుకోగా, పెళ్లి సమయంలో 800 గ్రాముల ఆభరణాలు, రూ. 20 లక్షల నగదును కట్నంగా ఇచ్చామని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. హనీమూన్ కోసం తాము మారిషస్ వెళ్లిన వేళ, తొలిసారిగా అతనిలోని కర్కోటకుడు బయటకు వచ్చాడని, విఫలయత్నం చేసి మద్యం తాగించాడని చెప్పారు.
తాగితే మత్తు రాదని, ఏమీ జరగదని, తనను నిరాశ పరచవద్దని చెబుతూ బలవంతం చేశాడని, ఆపై మత్తులో తానుంటే, సెల్ ఫోన్ లో చిత్రీకరించాడని ఆరోపించారు. వాటిని చూపి బెదిరించి మళ్లీ మళ్లీ తాగిస్తున్నాడని, మరింత కట్నం కావాలని వేధింపులు ప్రారంభించాడని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేయగా, తనతో కలసి ఉండటం ఇష్టం లేకనే, తన భార్య ఇటువంటి ఫిర్యాదుతో వచ్చిందని ఆమె భర్త ఆరోపిస్తుండటం గమనార్హం. వీరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నామని, కుదరకుంటే, తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వ్యాఖ్యానించారు.