: చైనాకు మరో షాకిచ్చేందుకు మరో ప్లాన్ రెడీ చేస్తున్న కేంద్రం!


ప్రపంచంలోనే చైనా వస్తువులు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ది ప్రథమ స్థానం. అందుకే భారత్ లో ప్రతి పట్టణంలో చైనా మార్కెట్ ఒకటి ఉంది. ఇక్కడ పది రూపాయల నుంచి వస్తువులు దొరుకుతాయి. దాంతో భారతీయులు ఈ వస్తువులను ఎగబడి కొంటారు. అయితే, డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్ ను మోకరిల్లేలా చేయాలని చైనా... చైనా తోక కత్తిరించాలని భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  

ఈ నేపథ్యంలో గత వారం భారత్ లోని గ్లాండ్ ఫార్మాను సొంతం చేసుకోవడం ద్వారా అమెరికా ఫార్మారంగంలో కాలు మోపాలని భావించిన చైనా సంస్థ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి అనుమతులు నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కుప్పలు తెప్పలుగా భారత విపణిలోకి వచ్చిపడుతున్న చైనా టైర్లపై యాంటీ డంపింగ్‌ డ్యూటీని విధించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ధరకు చైనా టైర్లు లభిస్తుండడంతో దేశీయ కంపెనీలకు రక్షణ కల్పించే ఉద్దేశంతో చైనా టైర్ల దిగుమతులపై సుంకం విధించాలని నిర్ణయించింది. టన్నుకు 452.33 డాలర్ల (సుమారు 29 వేల రూపాయలు) సుంకం విధించే అవకాశం ఉంది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన పరిశోధన విభాగం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ యాంటీ డంపింగ్‌ అండ్‌ డ్యూటీస్‌ (డీజీఏడీ) నివేేదిక తయారు చేస్తోంది.

 ఈ నివేదికలో చైనా టైర్ల దిగుమతుల కారణంగా దేశీయ టైర్ల కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలు పొందుపరచనుంది. అంతే కాకుండా చాలా కాలంగా అపోలో టైర్స్‌, జేకే టైర్‌ ఇండస్ట్రీస్‌, సియట్‌ లిమిటెడ్‌ లు కోరుతున్నట్టు చైనా నుంచి దిగుమతయ్యే ట్యూబ్ లెస్ టైర్లపై సుంకం విధించాలన్న డిమాండ్ పై పోరాడుతున్న ఆటోమోటివ్‌ టైర్‌ మ్యానుఫ్యాక్చర్స్‌ అసోసియేషన్‌ (ఏటీఎంఏ) దరఖాస్తును కూడా పరిశీలించనుంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి దిగుమతయ్యే టైర్లపై టన్నుకు 277.53 డాలర్ల నుంచి 452.33 డాలర్ల మధ్య సుంకం విధించాలని డీజీఏడీ సిఫారసు చేసింది.

ఈ సందర్భంగా చైనా నుంచి దిగుమతి అవుతున్న టైర్ల వివరాలు తెలుపుతూ 2012-13 సంవత్సరాల్లో కేవలం 4,146 టన్నులు దిగుమతి కాగా, ఈ దిగుతులు జులై 2014- 2015 జూన్ వరకు 52,092 టన్నులకు చేరిందని తెలిపింది. దీంతో ఈ నివేదికను అనుసరించి చైనా నుంచి దిగుమతయ్యే టైర్లపై సుంకం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో చైనాకు తొలివాణిజ్య షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. చైనా ఇంకా దిగిరాని పక్షంలో భారత్ తదుపరి మరిన్ని వస్తువులను నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News