: రాత్రి వేళ మహిళలకు బయట ఏం పని?: హర్యానా బీజేపీ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలా తన స్నేహితుడితో కలిసి మద్యం మత్తులో ఐఏఎస్ అధికారి కుమార్తెను అటకాయించి వేధించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్ష పార్టీలు బీజేపీని దుమ్మెత్తిపోస్తున్నాయి. బీజేపీ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రఘువీర్ భట్టీ సంచలన వ్యఖ్యలు చేశారు.
రాత్రి వేళల్లో ఓ మహిళను బయటకు ఎందుకు పంపించారు? అని ఆయన ప్రశ్నించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సుద్దులు చెప్పారు. వారిని రాత్రి వేళలో బయట తిరిగేందుకు అనుమతించకూడదని ఆయన సలహా ఇచ్చారు. చీకటి పడకముందే పిల్లలు ఇంటికి చేరుకోవాలని ఆయన హితవు పలికారు. రాత్రి బయట ఎందుకు గడుపుతారు? అంటూ స్త్రీల స్వేచ్ఛను ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పెను దుమారం రేగుతోంది.