: శనివారం ప్రీతిపాత్రమైన శ్రీ వెంకటేశ్వరునికి శుక్రవారం నాడు మాత్రమే అభిషేకం ఎందుకంటే..!
శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన వారం శనివారం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక వెంకటేశ్వరునికి శనివారం బదులుగా శుక్రవారం నాడు అభిషేకం నిర్వహిస్తారన్న విషయమూ విదితమే. ఇందుకు కారణాన్ని ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్వయంగా వెల్లడించారు. "స్వామివారికి వక్షస్థలంలో మహాలక్ష్మి స్వరూపం పద్మాసనంలో ముక్కోణాకారంలో కూర్చుని ఉంటుంది. ఈ అమ్మవారికి హరిత్రోదకం (పసుపు)తో అభిషేకం జరుగుతుంది. కాబట్టి, అమ్మవారికి, స్వామివారికీ ఒకే రోజు అభిషేకం చేయాలంటే అది శుక్రవారం నాడే చేయాలి. అందువల్లే శుక్రవారం నాడు అభిషేకం చేయాలని ఆగమ శాస్త్ర పెద్దలు శతాబ్దాల నాడే సంకల్పించుకున్నారు. ఈ రోజు వరకూ మనం అదే చేస్తున్నాం" అన్నారు. స్వామి, అమ్మవార్లకు ఒకేరోజు అభిషేకం చేయాలన్న ఉద్దేశంతోనే శుక్రవారం అభిషేకం చేస్తున్నట్టు తెలిపారు.