: బంగారంతో ఊపిరితిత్తుల కేన్సర్‌కు చెక్!
చిన్న చిన్న బంగారు రేణువులతో ఊపిరితిత్తుల కేన్సర్ కణాలకు చెక్ పెట్టవచ్చని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. ఊపిరితిత్తుల కేన్సర్ చికిత్సలో వాడే మందుల ప్రభావాన్ని బంగారు రేణువులు రెట్టింపు చేశాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. బంగారం నుంచి తయారుచేసిన నానోకణాలను ఓ కెమికల్ పరికరం ద్వారా శరీరంలోకి ఎక్కించడం ద్వారా కీమోథెరపీ వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌ను తగ్గించవచ్చని స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ జరాగోజా ఇనిస్టిట్యూట్ ఆఫ్ నానోసైన్స్ పరిశోధకులు పేర్కొన్నారు.
ప్రస్తుతానికి జీబ్రాఫిష్ విషయంలో ఈ విధానాన్ని ప్రయోగించామని, ఇంకా మనుషులపై ప్రయత్నించలేదని వారు తెలిపారు. రసాయనిక చర్యలను ఉత్తేజపరచడంలో బంగారం బాగా పనిచేస్తుందని, జీవుల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రసాయనిక చర్యలను ఉత్తేజ పరచడానికి బంగారం అణువులు మంచి ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయని వారు వివరించారు. ఈ విధానంలో మరికొన్ని మార్పులు చేసి, ఇంకా కొన్ని పరిశోధనలు చేసిన తర్వాతనే కేన్సర్ రోగులపై ప్రయోగిస్తామని పరిశోధనా బృందానికి చెందిన డా. యానీ మెక్‌కార్తీ చెప్పారు.