: గ్రహణంతో అన్ని ఆలయాలూ మూతపడుతున్న వేళ... తెరచుకొని ఉన్న ఒకే ఆలయం ఇది!


నేడు చంద్రగ్రహణం కారణంగా అన్ని దేవాలయాలూ ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. నేటి రాత్రి 10.52కు మొదలయ్యే గ్రహణానికి మధ్య కాలం 11.50 అని, మోక్షకాలం 12.49 అని, మొత్తం పుణ్యకాలం 1 గంటా 57 నిమిషాలని వేద పండితులు పేర్కొన్నారు. శ్రవణా నక్షత్రంలో, మకరరాశిలో సంభవిస్తున్న అర్గలగ్రాస కేతుగ్రస్త చంద్రగ్రహణం 'చూడామణి' నామకమని, ఈ గ్రహణం వల్ల అత్యధికులకు మేలు కలుగుతుందని అంటున్నారు. కాగా, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని ఈ ఉదయం 11 గంటలకు మూసివేశారు. తిరిగి అమ్మవారి ఆలయం తలుపులు రేపు ఉదయం 10.30కి తెరచుకోనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం సాయంత్రం 4 గంటలకు మూత పడనుంది. తిరిగి గ్రహణ కాలం పూర్తయిన తరువాతే ఆలయం తలుపులు తెరచుకుంటాయి.

సింహాద్రి అప్పన్న ఆలయం, అన్నవరం సత్యనారాయణస్వామి దేవాలయం, యాదగిరి నృసింహుని ఆలయం, భద్రాద్రి రామాలయంతో పాటు అన్ని ప్రముఖ దేవాలయాలూ మూతపడనున్నాయి. ఇదే సమయంలో చిత్తూరు చిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవాలయం మాత్రం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంది. ఇక్కడ గ్రహణ సమయాల్లో సైతం దైవారాధన జరుగుతుంది. గ్రహణ సమయంలో రాహుకేతు పూజలు జరిపించుకుంటే మంచిదని భక్తులు నమ్ముతుంటారు. ఇక ప్రస్తుత గ్రహణం కేతుగ్రస్తమైనది కావడంతో, కేతు గ్రహ ప్రభావం ఉన్నవారు ప్రత్యేక పూజల కోసం కాళహస్తికి పోటెత్తారు. భక్తుల పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు దేవాలయ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News