: కాశ్మీర్ పై మాట్లాడుకుందామా?: ఇండియాకు పాక్ కొత్త ప్రభుత్వం ఆఫర్
ఇండియా, పాకిస్థాన్ ల మధ్య శాంతి నెలకొనాలంటే, కాశ్మీర్ అంశమే కీలకమని, ఈ విషయంలో చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సి వుందని పాక్ కొత్త ప్రభుత్వం అభిప్రాయపడింది. "మా సరిహద్దులను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. కాశ్మీర్ సమస్య పరిష్కృతమైతేనే ఇరు దేశాల మధ్యా శాంతి నెలకొంటుంది. ఈ దిశగా భారత్ ను చర్చలకు ఆహ్వానిస్తున్నాం" అని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఖావాజా ఆసిఫ్ సియాల్ కోట్ లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
పాక్ కు గతంలో రక్షణ మంత్రిగా కూడా పని చేసిన ఆయన, ఈ విషయంలో భారత్ స్పందించనంత వరకూ తాము ఏమీ చేయలేమని అన్నారు. ఉద్రిక్తతలు తగ్గించాలన్నదే తమ అభిమతమని, కానీ, ఇండియా అలా కోరుకోవడం లేదని ఖావాజా ఆరోపించినట్టు 'ఎక్స్ ప్రెస్ న్యూస్' పేర్కొంది. ఇండియా, ఆఫ్గనిస్థాన్ లతో స్నేహపూర్వక సంబంధాలనే తాము కోరుకుంటున్నామని, ఈ ప్రయత్నాలను విజయవంతం చేసేందుకు తమవంతు కృషిని చేస్తున్నామని అన్నారు. ఉగ్రవాదంపై తాము సుదీర్ఘకాలంగా పోరాటం సాగిస్తున్నామని, ఈ పోరాటంలో తమ దేశపు సైన్యం ఎన్నో త్యాగాలను చేసిందని ఆయన అన్నారు.